కల Poem by Jayaprabha

కల

సూట్ కేస్ దింపటం మరిచిపోతాను
రైలెళ్లి పోతుంది
చిన్ననాటి జ్ఞాపకాలూ
చిరిగిపోయిన వస్త్రాలూ నేనూ
అలాగే నిలబడి చూస్తూండగా
పులి వెంట తరుముతుంది !

నా చుట్టూ కోట్ల కొద్దీ ఉత్తరాలు
ఒక్కటీ నాకర్ధం కావు
ఎదురుగా తెలియని ఏదోదారి
పరిచయస్తులంతా ముందే పడవెక్కేసారు
భీతావహ శూన్యం నాలో
అదేమిటో ఏ తలుపూ వేయబడదు
అస్పష్టంగా జయా అన్న ఒక పిలుపు

ఎంతగా తడుముకున్నా ఏ స్పర్శా అంటదే !
పక్కకి చూసేసరికి పామొకటి పక్కలో
తప్పించుకుపోలేక గుట్టలుగా పుస్తకాలు
కడుపులో లేచిన మంట
ఎర్రగా చెలరేగి గొంతుని కాల్చేస్తోంది దాహం ! దాహం !

నరనరాన కడలి పొంగు
తెరపై పొగమంచు లాంటి దృశ్యం
నేనింకా నేలమీద పడ్డానో లేనో
అమ్మ మాయలోనే ఉన్నానో
అని తర్కించుకుంటూ ఉంటే
జ్ఞానదంతం పొడుచుకొచ్చి
ముల్లులా గుచ్చుకుంది !
గొల్లుమని చెవి పక్కనే అలారం

గోల గోలగా కాలం !

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success