దిగంతాల కవతల నుండి నీ పిలుపులు అమృతపు సోనలా, తేనెలవాకలా,
మరందధారలా జాలువారి మనస్సుని రసప్లావితం చేస్తున్నాయి
పలుకులమ్మ కరకమలములపై వాలిన రామచిలుక
పదాల సోయగపు విన్యాసాల్ని
పుణికి పుచ్చుకొన్న నీ పిలుపులు దూరాల తీరాలని దాటి
నా మనఃకేదారాల్ని సస్యశ్యామలం చేస్తున్నాయి
భాష వ్యక్తీకరించలేని అవ్యక్త మధురిమను రంగరించి నీ పలుకులు
పులకింపచేసి నన్ను మైమరపింప చేస్తున్నాయి
తరాల అంతరాలని తుడిపేస్తూ, బంధాలు రసబంధాలై, అనుబంధాలై
తాత మనవళ్ళని పెనవేసుకొని మమేకం చేస్తున్నాయి
కడలి గడిచి గగన వీధిన నదీనదాలు, కొండకోనలు, లోయలు దాటి
నా మనస్సు సంరంభంగా, సంబరంగా, చిలిపి రంగడికై, శరీరమై, తాతై నీ దరికి చేరుతోంది
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem