మానసిక క్షోభలలో దుస్సహమైనది కడుపుకోత,
కాలం గీసిన మృత్యుగీతను పరీక్షించేది గుండెకోత
అకస్మాత్తుగా CARE- ICU లోనికి డోలాయమానమైన మనసు ప్రవేశం
నాలుగుమూలల Cubicle లోని దైన్యపు కాంతులు మిరుమిట్లు కొలుపుతున్నవి
మానవీయవిలువలు అక్కలు, అన్నల రూపంలో పరుగులెత్తు తున్నవి
అనుక్షణం గుండె చప్పుళ్ళు తుపాకి గుళ్ళలా రొదచేస్తున్నవి
గడ్డకడుతున్న శీతల వాతావరణంలో బాధితుల విషణ్ణ వదనాల దీనారావాల
గుండె చప్పుళ్ళు వైద్యుల Rounds లో ఉపశమనం వెదుకుతున్నవి
శరీరాభిమానాన్ని, సిగ్గునీ, కోల్పోయి శల్యావశిష్టమైన
శరీరాంగాలని, అసహ్యపడకుండా, కత్తికోతకనువుగా
శుభ్రపరుస్తున్న వృత్తిధర్మం ఉత్తమోత్తమమైన మానవత్వం.
రాతిబండలాంటి గుండెని పిండి, పీల్చి, పిప్పిచేసి కత్తులతో కోసే
చికిత్స అనే క్రతువులోని సమతుల్యత, క్రమశిక్షణ, మేధస్సు,
సృష్టికర్త విరచించిన ఆయుఃప్రమాణానికి సవాలు విసురుతున్నవి
రాత్రింబవళ్ళు రెక్కలుముక్కలు చేసుకుని నవ్వుతూ తిరుగాడే నర్సులు
అక్కలై, అమ్మలై, అన్నీతామై అందిస్తున్న సేవ నిరుపమానమైనది
ఆర్తులపాలిట వారి సేవ ఎన్నటికీ తీర్చలేని ఋణానుబంధం
అది వైద్య ప్రపంచంలోని వసుధైక గీతం
ఆరిపోయే దీపాలలాంటి వృధ్ధమూర్తులని చరమాంకములో
అక్కునచేర్చుకునేఆసుపత్రి తిరుపతికన్నా పవిత్రమైనది
మృత్యుప్రాంగణాన, యమయాతనల విలవిలలలో
గుండెకోతల శస్త్రచికిత్సలో CARE సిబ్బంది
ప్రావీణ్యానికి నా హృదయం నీరాజనాలర్పిస్తున్నది
తెగిన తీగలు కలుపుతున్న Pacemakerను Peacemakerగా,
మృతసంజీవినిగా మార్చినవజీవనాన్ని ప్రసాదిస్తున్న వైద్యనారాయణులకు
నా మనసు సభక్తికంగా అంజలి ఘటిస్తున్నది.
మాదిరాజు నరసింహారావు (Dedicated to Dr.C.Sreedevi Gaaru)
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem