పడమటి గాలి కబురు మోసుకొచ్చింది
నత్తనడక జీవనానికి కాయకల్పచికిత్స
మానసాకాశంలో సంఘటనల ఘర్షణ
ముసురు పట్టిన మానసం
కరుడు కట్టిన స్వార్ధం
మొరాయించే శరీరం
కుచించుకున్న కాలం
నిశ్శబ్ద కాసారంలో సుదూరతీరాల అలజడి
ఎదురుచూపుల ఆకర్షణల మాయాజాలం
పరిసరాలని ఆవహించిన చైతన్యం
ఇల్లొక బొమ్మల కొలువు
మనసొక ఇంద్రధనుస్సు
నిశాగగనంలో చంద్రోదయం
విచ్చుకొన్న వదనకమలం
నవ్వుతున్న కళ్ళు
రామచక్కని కళ్ళు
అల్లరల్లరికళ్ళు
కామనల పుట్టిళ్ళు
చిలిపి లోగిళ్ళు
చారడేసి కన్నుల విలోకనం
అభంశుభం, కల్లాకపటం
తెలియని అమాయకత్వం
తలపండిన అనుభవంతో
చేసిన చెలిమి
అది ఉప్పొంగిన మాధుర్యరసధార
కాలం కారు చక్రంలా గిర్రున తిరిగి
దృశ్యం విమానాశ్రయానికి చేరుతుంది
విరిగిన బొమ్మలనీ మరబొమ్మలనీ వదిలి
విధి చైదానికి దిగులుపడి తాతకు టాటాచెప్పి
నాన్న చేయిపట్టుకొని తలతిప్పుకొని
లోహవిహంగంవైపు వేసే ప్రతి అడుగూ
తరాల అంతరాలని పెంచుతుంది
ఏమీ తెలియని పసితనం దుఃఖ సముద్రాలని దాటుతుంది
తూరుపు సింధూరం పడమటిసంధ్యారాగమై కనుచూపుని దాటుతుంది
తలపుల తలుపులని తెరచి శూన్య గేహం బావురుమంటుంది
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem