Telugu Poem రెండు కొసల మధ్యన Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem రెండు కొసల మధ్యన

Rating: 5.0

*రెండు కొసల మధ్యన*

అనుకోకుండానే
వెలుతురు నుండి చీకట్లోకి ఎగిరిపోతావు
తెలియకుండానే
చీకటి నుండి స్వప్నంలోకి వాలిపోతావు
ఉలిక్కిపడుతూనే
స్వప్నం నుండి నిజంలోకి జారిపడతావు

రుచి వాసన లేని అడుగులని భుజాన మోస్తూ
కదులుతున్న క్షణాలు వెంట తీసుకు పోతుంటే
వెళ్ళడమే తెలుస్తుంది

ఆరేదాకా వెలగాలని
వెలిగినంతసేపే ప్రాణమని
తెర దించాక ప్రపంచానికి నువ్వు లేవని
నీకు ప్రపంచమూ లేదనీ
కొత్తగా తెలియడానికి ఏమీ లేకున్నా
నాలుగు గదుల గుండెను
ఖాళీ చేయడమంటే యెంత కష్టం

రెండో
మూడో
కన్నీటి బొట్లు మిగిలే వుంటాయి
నిన్ను నువ్వు తడుపుకోవడానికి
కురవడానికి ముస్తాబయిన మబ్బులూ వుంటాయి

తనివితీరా తడిసిపో
ఎలా తడిసిందీ..
ఎందుకు తడిసిందీ...
నిన్ను ఒడిలో దాచుకునే నోరు లేని మట్టి
ఎవ్వరికీ చెప్పదు!
ఎందుకూ అని అడగదు! !

*పారువెల్ల*
19-12-2016

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success