Telugu Poem వెండిపూల వాన Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem వెండిపూల వాన

ఎందుకు నటిస్తావో అర్థం కాదు
మబ్బుల మాటు దాగి చందమామలా తొంగి చూస్తావు

గరక పోసలను గుండెకు హత్తుకుంటావు
గడ్డి పూల వాసన గమ్మత్తుగా వుందంటావు

చీకటి తెలియని నడకంటావు
పున్నమి వెన్నెల నవ్వంటావు

గురుతులు మాసిపోలేదని
గుండెను కడుక్కోలేదని
పొద్దు తిరుగుడు పువ్వులా
ఎప్పుడూ నన్నే చూస్తున్నానని

కొత్తగా ఎన్నో చెప్తావు!
ఒక్కటీ అర్థం కాదు! !

ఏం జారిపోయిందో
ఎందుకు చేజారిపోయ్యిందో
ఖాళీ చేతుల్ని చూసి ఎందుకు వెక్కిరించావో

కరిగి పోయిందెవరో
విరిగి పోయిందెవరో
కడలి తీరంలో ఒంటరిగా ఒరిగి పోయిందెవరో

ఏదీ గురుతులేదంటే ఎట్లా నమ్మేది..! !
చల్లని చినుకుల్లో తడిసిన వెచ్చని జ్ఞాపకం
వెంటే వున్నది
వెండిపూల వాన నువ్వెందుకు కురిపిస్తున్నావో
అర్థం కాదు! అర్థమే లేదు! !

పారువెల్ల
30-08-2017

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success