*పాలపిట్ట*
పుట్టినందుకు ఏదైనా చెయ్యాలె
చావు తప్పదు గనక చచ్చేదాక బతకాలె
చచ్చినా బతికుండాలె.
గురుతులు మిగిలేటట్టు
అడుగులు నిలబెట్టాలె.
అప్పుడప్పుడూ కాలం నఖరాల్ చేస్తుంటది
నరాలు పీకి ఎండబెట్టాలె.
మతమంటే గద్దలకే ఎరుక
ఎత్తుకు ఎగిరినందుకు
ఆకాశమంతా మాదనుకుంటయ్
రెక్కల్ని విరిచి పాతిపెట్టాలె
పిస బిత్తిరి కాకులు
కులాలను కెలుకుతుంటయ్
పిచ్చిగా ఒర్లుతుంటయ్
నాల్కలు పీకి తగలబెట్టాలె
వట్టిగా చితి మంటల్లో మండటానికేనా, ఇంతటి కష్టం!
కాగడాలా వెలిగే దమ్ము, రొమ్ములో మొలకెత్తాలె.
దోస్త్.....
పుట్టినందుకు ఏదైనా చెయ్యాలె
చచ్చినా బతికుండాలె
పాణం పుణ్యానికొచ్చినదేం కాదు
పాలపిట్టలెక్క అరుదైనది.
ముక్కుతో స్వర్గాన్ని పట్టుకొని ఎగురుతుంటది
రెక్కలమీద దుఃఖాన్ని మోస్తుంటది
*పారువెల్ల*
14-10-2017
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem