Telugu Poem ఇంకా ఏదో మిగిలే ఉంది Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem ఇంకా ఏదో మిగిలే ఉంది

* ఇంకా ఏదో మిగిలే ఉంది *

మూల్గుతూ
ఆయాసపడుతూ
పారిపోతున్న గాలి

దారిని కప్పేసిన పొడవైన చీకటి
నిశ్చలనమై
నిదురలోకి జారుకున్న అడుగులు

పసరు మందు పూయలేని లోతుల్లో
ఓ గాయం
పడమటి పొద్దులా వెలుగుతూ

అప్పుడప్పుడు
వినిపించడానికో కనిపించడానికో
నింగి నేల మధ్య ఊగిసలాడుతూ
మొహమాటపడుతున్న కొన్ని నిజాలు

"ఎవరక్కడ? "
ఓ శాసనం ఉరిమినట్లు మెరిసింది

దిక్కులన్నీ ఏకమయ్యాయి!
"ఎవరూ లేరిక్కడ
ఉన్నవాళ్ళు
ఉండాల్సినవాళ్ళు
అందరూ సమాధుల్లోనే

అనుభవించడానికి
ఆస్వాదించడానికి
ఏవీ లేవిక్కడ
అన్నీ సమాధుల్లోనే "

సమాధులింకా బతికే ఉన్నాయి
ఇంకా ఏదో మిగిలే ఉంది!

శిలాఫలకం ఇటువైపే చూస్తోంది! !

~ పారువెల్ల ~
(09-10-2013)

Friday, November 11, 2016
Topic(s) of this poem: telugu poem
COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success