Telugu Poem అడుగులు Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem అడుగులు

అడుగులు

నలుగురిలో ఒంటరివైనందుకు
నాలుగు గోడల మధ్య నీకేం బాధ!
తోవ ఎప్పుడూ చిత్రమే! !
అర్థం కాని మలువుల్లో
అర్ధాంతరంగా వదిలేసి

ఒక్కడివైనందుకు
ఒక్కడివే వున్నందుకు
ఒంటరితనమంతా రాత్రికి బహుమానంగా రాసిచ్చేయ్
నింగి సుక్కలు నీ కంటిచుక్కల్లో మెరిసినందుకు
రాత్రి ముచ్చట తీర్చుకుంటుంది

ఆశల మొగ్గలేవో
తోకచుక్కలై రాలి పడుతున్నందుకు
చెప్పాలనుకున్న మాటలేవో
ఎగిరిపోయిన పిట్టలైనందుకు
అడుగుల గురుతులన్నీ తడుముతుంటాయి

మాసిపోయిన గతం మళ్ళీ మళ్ళీ మెరవనీ
మరక మంచిదే గాయమూ మంచిదే
అడుగులు మార్చుకోవడానికి
రెక్కలు విదుల్చుకోవడానికి
చీకటి పొరల్ని చించి వెలుతురు దృష్టి పారించడానికి

పారువెల్ల
28-08-2016

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success