Telugu Poem పగిలిన గాజు ముక్కలు Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem పగిలిన గాజు ముక్కలు

* పగిలిన గాజు ముక్కలు *

ఎవరో పిలుస్తారు
ఎదను పదిలంగా అప్పజెప్పాక
ఎరుకే లేని మరక

పొద్దుకు నిద్దురొచ్చే వేళ
హృదయంలో గాయం ఉదయం
కళ్ళలో చీకటెంత పోసుకున్నా
కనులకు కునుకే రాదు

మురిపించిన మొన్నటి కలలన్నీ
ముఖం చాటేసుకున్నాక
ఎందుకో తెలియదు గానీ
నువ్వూ నాలాగే నవ్వుతావు
నురగలా విరగబడి
తీరం చేరిన కెరటం
కేరింతలు కొట్టినట్టు

పూడ్చలేని లోతులు
పూడిక తీయలేని గొంతులు
అయినా
అడుగులన్నీ మంచికేనంటూ
అడుగులన్నీ మంచివేనంటూ
ఓ పిచ్చుక గూడును కట్టుకుంటాయి

అలల కౌగిలించుకున్నాక
కడలి ప్రేమించాక
కలల గూడు కూలిపోయాక
గవ్వలన్నీ గువ్వలవుతాయి
పగిలిన గాజు ముక్కల్ని మోస్తూ

~ పారువెల్ల ~
22-02-2015

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success