* మనలా మరెవరుంటారు *
కొన్ని రాత్రుల్లో
వెన్నెల జలపాతం వొళ్ళు తడుపుతున్నా
ఎన్ని కన్నీళ్లను తాగి
దాహం తీర్చుకున్నామో మనం.
చల్లని చలికాలంలో
ఓ గోరువెచ్చని కలను పరాయిదాన్ని చేసి
కనులను విడిచి
చెక్కిళ్లతో చెలిమి చేసిన
ముత్యాలెన్నో దాచుకున్నాం
మన ప్రేమ గుర్తులుగా
రాలిపోయిన ఎండుటాకుల్లోనూ
రాగాలెన్నో విన్నాం
చేయి దాటిన ప్రతీ క్షణాన్ని
పల్లకీలో కూర్చుండబెట్టి
ఘనమైన వీడ్కోలు పలికిన మనసు
మనకుగాక మరెవరికుంటుంది
అలిగి వెళ్ళిన అందమైన జ్ఞాపకాలన్నిటినీ
పువ్వులతో పూజిద్దాం ముళ్ళను దాచుకొని.
గులాబీలెప్పటికీ నవ్వుకుంటాయి
పువ్వుల నవ్వులు
పున్నమి వెన్నెలలు
కోరికల గుసగుసలు
మాటల గిలిగింతలు
తీరని దుఃఖాలే మనకు
ప్రియా!
ప్రేమంటే ఇదేనా! !
అయితే, దాహాన్ని తీర్చుకున్నట్టుగా
చీకటిని కూడా కదిగేద్దాం కన్నీళ్ళతో
~ పారువెల్ల ~
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem