Telugu Poem ఇలా తడిసిపోనీ.... Poem by Srininivas Reddy Paaruvella

Telugu Poem ఇలా తడిసిపోనీ....

Rating: 5.0

ఇలా తడిసిపోనీ....

వెలుతురు కత్తులను మోసుకొస్తావు. చీకటికుత్తుకలను కోయాలని కోరిక లేకుండానే కదలిపోతావు.

అలుపెరుగని పిట్టల రెక్కల పొగరుని ఒడిసి పట్టుకుంటావు. ఆకులే లేని ఎండిన కొమ్మలమీద కూర్చుంటావు.

కనులే తెలియని కలలను కడిగేస్తావు, కలలే లేని కనులకు చీకటి బహుమానంగాఇచ్చేస్తావు. ఎందుకో యేదీ చెప్పవు.

అనుకోకుండా దొరికిన అరుదైన పుస్తకాన్ని ఆత్రంగా తెరిచి చూస్తావు.నెమలీక కంటపడగానేపిల్లాడివైపోతావు.ఎన్ని రంగులో ఆ నెమలి కన్నుల్లో. ఎన్ని కళలో  ఆ రంగుల్లో.ఆప్యాయంగా తడిమి చూస్తావు.

చిరాకుగానైనా గాలిని కసరలేదు. చిరుకోపంగా కూడామేఘాలను తరమలేదు. చిన్నప్పటి ఆటల్లో రేగిన దుమ్మంతా మబ్బుల్లా కమ్ముకోవాలనీ, హాయిగా కురిసిపోవాలనీ మాత్రం కోరుకుంటావు.

ఏ లోతుల్లోనో మునిగిపోతుంటావు, గుండెబరువు చేసుకుంటూనే.జ్ఞాపకాలతో గలే మిలాయించాక తేలిపోవడం కష్టమేమీ కానందుకు. కాగితం పడవెక్కికాసేపు తిరిగొస్తానంటావు.

వెళ్ళిరా నేస్తం,వెళ్ళిరా. నువ్వెప్పుడూ ఒంటరివి కాదు.నీ జ్ఞాపకాల సాక్షిగా.....

నా కంటినిండా తడి.తృప్తిగా ఒక్కో బొట్టు రాలుతున్న చప్పుడు,హాయిగా జోకొడుతున్నది.

పారువెల్ల
14-08-2018

COMMENTS OF THE POEM
READ THIS POEM IN OTHER LANGUAGES
Close
Error Success