*నక్కలింకా పొంచి ఉన్నాయి*
అమ్మ జోకొడితే పడుకున్నావు చిన్నప్పుడు
అమ్మని సైతం జోకొట్టి నిదురపుచ్చే జోలపాటను
సరిహద్దు మరబొమ్మలు పాడాయని నీకింకా తెలియదు
సరిహద్దు రేఖల వద్ద కదిలే
ప్రాణం లేని మరబొమ్మల ముచ్చట నీకెందుకిప్పుడు
ఎముకల్ని గడ్డ కట్టించే మంచులో
ఆకలితో అలమటిస్తున్న నక్కలని
ప్రేమించి లాలించి జాలిగా కరిగిపోతావు
నన్నూ కరిగిపొమ్మంటావు
మట్టి మీదప్రేమంతా వ్యర్ధమంటావు
మట్టిబొమ్మల ముందు
రంగు గీతల ముందు
మోకరిల్లి నీకేవేవో కావాలని కోరుకుంటావు
కోడినో మేకనో బలిచ్చి పండగ చేసుకుంటే
జాలన్నావు ప్రేమన్నావు.
నవ్వు వెనుక కోరలు దాచుకున్న పాములను
దేహం లోపల కుట్రలు దాచుకున్న నక్కలను
ఇంటికి పిలుచుకొస్తున్నావు.
నువ్వు జాలిపడు
పడుతూ పడుతూ
ఇంటా బయటా పొంచివున్న మూగ జీవాలకు
ఈ మట్టి బెడ్డల్నిబలివ్వు
పారువెల్ల
26-02-2019
This poem has not been translated into any other language yet.
I would like to translate this poem